ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన పెండ్లి బస్సు.. 10 మంది దుర్మరణం

10 Killed, Several Injured In Bus Accident In Odisha’s Ganjam District

భువనేశ్వర్‌: ఒడిశాలోని గంజాం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గంజాం జిల్లాలోని దిగపహండి సమీపంలో ఒడిశా ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో పది అక్కడికక్కడే మరణించారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను బ్రహ్మపురలోని ఎంకేసీజీ దవాఖానకు తరలించారు.

మృతుల్లో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నవారే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు రాయ్‌గఢ్‌ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తున్నదని, ఒక పెండ్లి బృందం ప్రైవేటు బస్సులో వెళ్తున్నారని చెప్పారు. రెండు బస్సుల్లో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

కాగా, ప్రమాద ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఆర్థికసాయం ప్రకటించారు.