దమ్ముంటే నెల్లూరులో నా పై లోకేశ్ పోటీ చేయాలిః అనిల్ కుమార్ యాదవ్

తాత, తండ్రి సీఎంలు అయినా లోకేశ్ ఓడిపోయాడని ఎద్దేవా

anil-kumar-yadav-challenge-to-nara-lokesh

అమరావతిః టిడిపి యువనేత నారా లోకేశ్ కు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. దమ్ముంటే నెల్లూరులో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎలాంటి రాజకీయ చరిత్ర లేని కుటుంబం నుంచి వచ్చిన తాను ఎమ్మెల్యేగా గెలుపొందానని… తాత, తండ్రి ముఖ్యమంత్రులుగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన లోకేశ్ ఎమ్మెల్యేగా గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. నెల్లూరులో లోకేశ్ తన గెలుపును ఆపగలిగితే రాజకీయాల నుంచి తాను శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. లోకేశ్ ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటారా? అని సవాల్ విసిరారు.

తనను ఓడించేందుకు టిడిపి రూ. 200 కోట్లు రెడీ చేసిందని అనిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ వద్ద తాను ప్రత్యేకంగా మెప్పు పొందాల్సిన అవసరం లేదని అన్నారు. 80 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబ గౌరవాన్ని నారా లోకేశ్ కాళ్ల ముందు ఆనం రామనారాయణ రెడ్డి తాకట్టు పెట్టారని విమర్శించారు. ఒక్కసారి కూడా గెలవని లోకేశ్ కోసం ఆనం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు.