రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడతాం అంటూ ధీమా వ్యక్తం చేసిన కేటీఆర్

రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టబోతున్నాం అని ధీమా వ్యక్తం చేసారు మంత్రి కేటీఆర్. మంగళవారం నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ తో పాటు పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం , పలు కార్యాలయాలు ప్రారంభించడం చేసారు. అనంతరం భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ..పాలమూరు నుంచి ప్రధాని మోడీ పోటీ చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారని, ఓవైపు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలకు అన్యాయం చేస్తూ, ఏ ముఖం పెట్టుకుని పాలమూరులో ఓట్లు అడుగుతారని కేటీఆర్ మండిపడ్డారు. గ్యాస్, పెట్రోల్ ధరలు పెంచినందుకు మోడీ దేవుడయ్యాడా? అంటూ విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతలకు కేంద్రం ఆటంకాలు కలిగించినా, పనులు పూర్తిచేసి పాలమూరు రైతాంగానికి నీళ్లు అందించే బాధ్యత కేసీఆర్ సర్కారుదేనని పేర్కొన్నారు. అవసరమైతే న్యాయపోరాటాలు చేస్తామని, ప్రజాక్షేత్రంలోనూ తేల్చుకుంటామని అన్నారు.

నారాయ‌ణ‌పేట వేదిక‌గా డిమాండ్ చేస్తున్నా. రాష్ట్రం ఏర్ప‌డి ఎనిమిదిన్న‌ర సంవ‌త్స‌రాలు దాటి పోయింది. ఎప్పుడైనా అన్న‌ద‌మ్ముళ్లు వేరుప‌డితే ఆస్తిపంప‌కాలు చేయాల్సిన బాధ్య‌త త‌ల్లిదండ్రుల‌పై ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు రెండు అయ్యాయి. రాష్ట్రం వేరు ప‌డ‌క ముందు 811 టీఎంసీల వాటా మ‌న‌కు ఉంద‌ని ట్రిబ్యున‌ల్ తీర్పు ఇచ్చింది. ట్రిబ్యున‌ల్‌కు లేఖ రాసేందుకు కేంద్రానికి, మోడీకి స‌మ‌యం దొర‌క‌డం లేద‌ట‌. పంచాయితీని సెటిల్ చేసే ఉద్దేశం వారికి లేదు. ఎందుకంటే పాల‌మూరు ఎండాలి. ఎండితేనే క‌డుపు మండి ఉన్న ప్ర‌భుత్వం మీద తిర‌గ‌బ‌డి మాకు అవ‌కాశం ఇస్తార‌నే దురాలోచ‌న‌తో ఉన్నారు. నీళ్లు, నిధులు, నియామ‌కాలు వీటి కోసం తెలంగాణ ఉద్య‌మం జ‌రిగింది. 95 శాతం లోక‌ల్ రిజ‌ర్వేష‌న్లు తీసుకొచ్చి 2 ల‌క్ష‌ల 20 వేల మందికి ఉద్యోగాలు క‌ల్పించాం. అదే విధంగా నిధుల విష‌యంలో భారీగా విడుద‌ల చేస్తున్నాం. తెలంగాణ రాక‌ముందు వ్య‌వ‌సాయం ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా ఉంద‌నే విష‌యాన్ని ఆలోచించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో అందరినీ మట్టికరిపించి, 2024లో కేంద్రంలోనూ అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ హ్యాట్రిక్ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.