పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటన లో అపశృతి..రోడ్డు ప్రమాదంలో అభిమాని మృతి

పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కళ్యాణ్ కాన్వాయి ని ఫాలో అవుతూ వస్తూ ఓ అభిమాని మృతి చెందాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు అంజన్న సన్నిధానంలో తన వారాహి వాహన పూజా కార్య క్రమాలు జరిపారు. ఇందుకు గాను హైదరాబాద్ నుండి ఉదయం భారీ కాన్వాయి తో బయలు దేరారు. పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా ప్రజలు , అభిమానులు నీరాజనాలు పలికారు. ఇదే క్రమంలో వందలాది మంది అభిమానులు పవన్ కాన్వాయి వెంట వచ్చారు.

ఈ క్రమంలో తమ అభిమాన నేతకు అభివాదం చేసే ప్రయత్నం చేసి నలుగురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరిలో తలకు తీవ్ర గాయమై ఒక యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కిషన్ రావుపేట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ధర్మపురి ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కాన్వాయ్‌లోని ఓ కారును బైకు ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.