అవినీతి చేయ‌లేద‌ని నిరూపించే దమ్ము నీకుందా?: క్రాంతికి ష‌ర్మిల స‌వాల్‌

స్థానిక ఎమ్మెల్యే త‌న‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించార‌ని ఆరోప‌ణ‌

ysrtp-chief-ys-sharmila-fires-on-jogipet-mla-kranti-kiran

హైదరాబాద్‌ః వైఎస్‌ఆర్‌టిపి అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌… ప్ర‌జా ప్ర‌స్థానం పేరిట చేప‌డుతున్న యాత్రలో భాగంగా ఆయా నియోజ‌కవ‌ర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేల పాల‌న‌ను ప్ర‌శ్నిస్తూ ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా మంగ‌ళ‌వారం సంగారెడ్డి జిల్లా జోగిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్న ష‌ర్మిల‌… అక్క‌డి స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మాజీ జ‌ర్న‌లిస్టు, టిఆర్ఎస్ నేత క్రాంతి కిర‌ణ్ తీరును ప్ర‌శ్నిస్తూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎమ్మెల్యే అవినీతి ప్ర‌శ్నించిన త‌న‌పై క్రాంతి కిర‌ణ్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారంటూ షర్మిల మండిప‌డ్డారు. ఈ కేసుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని ఆమె తేల్చి చెప్పారు.

ఈ సంద‌ర్భంగా క్రాంతి కిర‌ణ్ తీరు ప్ర‌శ్నిస్తూ ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పండితుడైన తండ్రి చేతనే ‘చెడపుట్టావ్ అని, అవినీతిపరుడు అని’ తిట్టించుకున్న వ్యక్తి మీరంటూ ఆయ‌న‌ను ష‌ర్మిల ఎద్దేవా చేశారు. కెసిఆర్ దళిత సీఎం అని మోసం చేసినప్పుడు.. దళిత మహిళ మరియమ్మను లాక్ అప్ డెత్ చేసినప్పుడు.. దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించినప్పుడు.. దళితులకు మూడెకరాల భూమి అని మోసం చేసినప్పుడు.. ఎస్సీ, ఎస్టీ నిధులు పక్కదారి పట్టించినప్పుడు.. ఎస్సీ, ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయనప్పుడు.. దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లని.. దళిత బంధు అని మోసం చేసినప్పుడు.. కేసులు పెట్టే ధైర్యం ఎక్కడ పోయింది క్రాంతి కిరణ్ గారు? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. పండిత పుత్ర పరమ శుంఠ అని ఊరికే అన్నారా? అని మ‌రింత ఘాటు వ్యాఖ్య‌లు చేసిన షర్మిల‌.. అప్పుడు కేసులు పెట్టడం చేతకాని మీరు.. ఇప్పుడు నాపై కేసులు పెడితే శుంఠ కాక మరేంటి? అని క్రాంతి కిర‌ణ్‌ను నిల‌దీశారు. మీ అవినీతిపై ప్రశ్నించే దమ్ము నాకుంది. కాదని నిరూపించే దమ్ము నీకుందా? అని కూడా ష‌ర్మిల ఆయ‌న‌కు స‌వాల్ విసిరారు. జర్నలిస్ట్ లను పిలుద్దాం, ప్రతిపక్షాలను పిలుద్దాం, జోగిపేట నడిగడ్డ మీదే చర్చ పెడదామంటూ ష‌ర్మిల పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/