నేడు ‘వైఎస్‌ఆర్‌ కాపు నేన్తం’ ప్రారంభం

అర్హులకు వారి బ్యాంక్ అకౌంట్లలో రూ.15 వేలు జమ

AP CM Jagan
AP CM Jagan

అమరావతి: ఏపిలో ఈరోజు ‘వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం’ అమలుకు సిఎం జగన్‌ రంగం సిద్ధం చేశారు. నవరత్నాల్లో భాగంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య కాపు మహిళల జీవనోపాధిని మెరుగు పరిచేందుకు ఏడాదికి రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో రూ.75 వేలు ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీని సిఎం జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి అమలు చేయనున్నారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కడం ద్వారా అర్హులైన కాపు మహిళలు 2,35,873 మంది బ్యాంకు ఖాతాలకు నేరుగా రూ.15 వేల చొప్పున మొత్తం రూ.354 కోట్లు జమ చేయనున్నారు. అయితే ఏడాదికి రూ.15వేలు ఇవ్వడం ద్వారా పేద కాపు వర్గం మహిళలను ఆర్ధికంగా ఆదుకోవడానికి వీలవుతుందని జగన్ నిర్ణయించారు.

కాగా దారిద్ర్య రేఖకు దిగువన ఉండేవారిని ఈ పథకానికి అర్హులుగా భావించారు. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేల లోపు ఉన్న వారు ఈ పథకానికి అర్హులు. కుటుంబానికి 3 ఎకరాలలోపు మాగాణి లేదా 10 ఎకరాలలోపు మెట్ట భూమి ఉండొచ్చు. లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండొచ్చని ప్రభుత్వం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగులకు మించిన ఇల్లు.. లేదా ఇతర ఏ నిర్మాణాలు కలిగి ఉండరాదని కండీషన్ పెట్టింది. అలాగే ఆ కుటుంబంలో ఏ వ్యక్తీ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదనీ… ప్రభుత్వ పెన్షన్‌ పొందుతూ ఉండకూడదనే కండీషన్ కూడా పెట్టింది. అంతేకాదు ఆ ఫ్యామిలీకి కారు లాంటి నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. ఆటో, ట్యాక్సీ, ట్రాక్టర్లు ఉండొచ్చు. కుటుంబంలో ఎవరూ ఇన్‌కంటాక్స్ చెల్లింపుదారుడై ఉండకూడదు. దాదాపు ఆరు నెలల నుంచి ఈ పథకానికి మహిళలు అప్లై చేసుకున్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ అర్హుల ఎంపిక ప్రక్రియ నడిచింది. ఇప్పుడు అన్ని లెక్కలూ తేల్చి… పథకాన్ని అత్యంత పక్కా ప్రణాళికతో ప్రభుత్వం అమల్లోకి తెస్తోంది. జగన్ ఈ స్కీమ్ ప్రారంభించగానే… లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలోకి మొదటి ఏడాదికి సంబంధించి… రూ.15వేలు జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/