ఉగాది సందర్భాంగా తిరుమలలో రెండ్రోజులు బ్రేక్‌ దర్శనాలు రద్దు

Tirumala Temple
Tirumala Temple

ఉగాది సందర్భాంగా మార్చి 21, 22 తేదీల్లో తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. ఆ రెండ్రోజులకు సంబంధించి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 22న శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని టీటీడీ ప్రకటించింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు.

ఇక ఉగాది పర్వదినాన ఉదయం 6 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామికి, విష్వక్సేనులకి విశేష సమర్పణ చేస్తారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తర్వాత శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారని టీటీడీ వెల్లడించింది.