నేడు విచారణకు రాలేను..సీబీఐకి అవినాష్‌రెడ్డి లేఖ

అత్యవసర పనులు ఉండడం వల్ల రాలేనంటూ ఎంపీ లేఖ

ys-avinash-reddy-wrote-a-letter-to-cbi

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి నేడు సీబీఐ విచారణకు హాజరుకాలేదు. ఈరోజు విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ, ఆయన హాజరుకాకుండా సీబీఐ అధికారులకు లేఖ రాశారు. షార్ట్‌ నోటీసు ఇచ్చినందున.. విచారణకు మరింత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున రాలేనని చెప్పారు. ‘‘మరో నాలుగు రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. నాలుగు రోజులు సమయం కావాలి’’ అని సీబీఐకి రాసిన లేఖలో అవినాష్‌ పేర్కొన్నారు. సీఆర్‌పీసీ 160 సెక్షన్‌ కింద అవినాష్‌కు సోమవారం సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

కాగా, వివేకా హత్య కేసులో విచారణకు రావాలంటూ ఎంపీ అవినాశ్ రెడ్డికి సోమవారం సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని అందులో పేర్కొంది. ఇప్పటికే పలుమార్లు సీబీఐ అధికారులు ఎంపీని విచారించి, స్టేట్ మెంట్ రికార్డు చేశారు. దాదాపు 20 రోజుల విరామం తర్వాత తాజాగా మరోమారు విచారణకు రమ్మంటూ నోటీసులు జారీ చేశారు. మరోవైపు, ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఎంపీ అవినాశ్ దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది.