ఢిల్లీలో మరో ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపు

Delhi’s Amrita School Gets Bomb Threat Via E-mail

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీ లోని ఓ ప్రైవేటు పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. సౌత్‌ ఢిల్లీ లోని పుష్పవిహార్‌ ప్రాంతంలోగల అమృత పాఠశాలకు మంగళవారం ఉదయం 6:33 గంటల ప్రాంతంలో ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన యాజమాన్యం ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు తెలియజేశారు. అనంతరం పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బందిని అక్కడి నుంచి తరలించారు. పోలీసులు , బాంబు స్వ్కాడ్‌ పాఠశాల వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానిత వస్తువులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

కాగా, ఢిల్లీలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో చాలా సార్లు పలు పాఠశాలలకు ఫోన్‌కాల్స్‌, ఈ-మెయిల్స్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా మధుర రోడ్‌ లో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌‌ కు బాంబు బెదిరింపులు వచ్చాయి. అంతకుముందు సాదిఖ్ నగర్‌ లోని ఇండియన్‌ పబ్లిక్‌ స్కూల్‌ ప్రాంగణంలో బాంబులు ఉన్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్‌ ద్వారా బెదిరించారు.