సర్దార్ వల్లభాయ్ పటేల్ వల్లే తెలంగాణ విముక్తమైందిః అమిత్ షా

బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్న అమిత్ షా

amit-shah-public-meeting-in-jangaon

జనగామ: తాము అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని, ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని బిజెపి అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. జనగామలో ఏర్పాటు చేసిన సకల జనుల విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. జనగామకు నమస్కరించి… కొమురవెల్లి మల్లన్నను… సిద్దులగుట్ట సిద్దేశ్వరుడిని తలుచుకొని అమిత్ షా ప్రసంగం ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారులను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా నిజాం నుంచి తెలంగాణ విముక్తమైందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్, నిన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కుటుంబ పార్టీలు అని విమర్శించారు.

సామాజిక న్యాయం కోసం… తెలంగాణలో అధికారంలోకి వచ్చాక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించింది తామే అన్నారు. ఇప్పటి వరకు బీసీని ఎవరూ ముఖ్యమంత్రి చేసే ధైర్యం చేయలేదన్నారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు బిజెపి కట్టుబడి ఉందన్నారు. ఇప్పటి వరకు వారి గురించి ఏ పార్టీ ఆలోచించలేదన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వమని ఆరోపించారు. వీరి అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి జైలుకు పంపించే బాధ్యత బిజెపిదే అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, మియాపూర్ భూములు, ఓఆర్ఆర్… ఇలా అన్నింటా కెసిఆర్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు.

కెసిఆర్ రాజ్యాంగ విరుద్ధంగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారని, తాము అధికారంలోకి రాగానే వాటిని తొలగించి ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామని హామీ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కలిపిస్తోందన్నారు. వరికి రూ.3100 మద్దతు ధర ఇస్తామని, ఫసల్ బీమాను ఉచితంగా ఇస్తామన్నారు. ప్రధాని మోదీ కారణంగా ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందన్నారు.

నేను స్థానికుడిని.. గెలిపించండి: ఆరుట్ల దశమంత్ రెడ్డి

బిఆర్ఎస్ తరఫున జనగామ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఇక్కడికి వచ్చింది లేదని, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీ నుంచి పోటీ చేస్తున్నారని జనగామ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి విమర్శించారు. కానీ జనగామ కోసం కొట్లాడిన మీ బిడ్డను నేను… తనను గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికలు ధర్మానికి- అధర్మానికి, న్యాయానికి- అన్యాయానికి, స్థానికుడికి- స్థానికేతరుడికి జరుగుతున్నవి అని, కాబట్టి అందరూ తన వైపు నిలుచోవాలని విజ్ఞప్తి చేశారు. తాను ఛాయ్ అమ్ముకొని పైకి వచ్చానని ప్రధాని మోదీ ధైర్యంగా చెబుతారని, కానీ తమ నాయకుడు పాస్ పోర్ట్ బ్రోకర్ అని బిఆర్ఎస్ నాయకులు చెప్పగలరా? అని ప్రశ్నించారు. స్థానికుడినైన తనను ఆశీర్వదించాలని ఆరుట్ల దశమంతరెడ్డి కోరారు.