హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ సమయాల్లో మార్పు

హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ సమయాల్లో మార్పు చేసారు. ఇక నుండి అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత కొద్దికాలంగా హైదరాబాద్ లో మందుబాబులు బీభత్సం సృష్టిస్తున్నారు. పీకలదాకా తాగడం..తాగాక..ఇష్టానుసారంగా వాహనాలను డ్రైవ్ చేసి ప్రాణాలను బలిగొనడం చేస్తున్నారు. ముఖ్యంగా అర్థరాత్రి తర్వాత నగరంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి.

ఈ నేపథ్యంలో మందుబాబులపై ఉక్కుపాదం మోపుతూ…రోడ్డు ప్రమాదాలను తగ్గించే లక్ష్యంతోనే అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 3 గంటల మధ్య డంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని అడిషనల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సుధీర్ బాబు తెలిపారు. 2023లో ఇప్పటి వరకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 13,431 మందిని పట్టుకున్నారు. వీరిలో 1317 మందికి జైలు శిక్ష పడింది. 243 మంది డ్రైవింగ్ లైసెన్స్‌ రద్దు అయింది. కోర్టు ఆదేశాలతో రోడ్డు రవాణా సంస్థ అధికారులు 53 మంది లైసెన్స్‌లను శాశ్వతంగా రద్దు చేయడం జరిగింది.