ఈ ఏడాది మొత్తం ప్ర‌జ‌ల కోసం జ‌గ‌న్ ఏం చేశారు?

కొత్త సంవ‌త్స‌రంలోనైనా రాష్ట్రం ప్ర‌గ‌తిబాట ప‌ట్టాలన్న యనమల

అమరావతి: ఏపీ ప్ర‌జ‌ల‌కు ముంద‌స్తుగా నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఏపీ సీఎం జ‌గ‌న్ పై టీడీపీ నేత‌లు య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ ఏడాది మొత్తం ప్ర‌జ‌ల కోసం జ‌గ‌న్ ఏం చేశార‌ని వారు ప్ర‌శ్నించారు. కొత్త ఏడాదిలోనైనా మంచి ప‌నులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలంటూ చుర‌క‌లంటించారు. కొత్త సంవ‌త్స‌రంలో అయినా ఏపీ ప్ర‌జ‌లంతా సుఖ‌సంతోషాల‌తో జీవించే విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిపాల‌న సాగాలని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు మీడియాతో అన్నారు. అయితే, కొత్త సంవ‌త్స‌రంలోనైనా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక దిశ‌గా ఏపీ స‌ర్కారు క‌స‌ర‌త్తు లేదని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

రెండున్న‌రేళ్ల పాల‌నా దుష్ఫ‌లితాల‌పై సీఎం జ‌గ‌న్ క‌నీసం స‌మీక్షయినా నిర్వ‌హించ‌డం లేద‌ని ఆయ‌న చుర‌క‌లంటించారు. రాష్ట్రం బాగుప‌డే అవ‌కాశాలు క‌నుచూపు మేర‌లో కూడా క‌న‌పించ‌ట్లేదని య‌న‌మ‌ల విమ‌ర్శ‌లు గుప్పించారు. క‌నీసం ఈ కొత్త సంవ‌త్స‌రంలోనైనా రాష్ట్రం ప్ర‌గ‌తిబాట ప‌ట్టాలని కోరుకుంటున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఏపీలో సీఎం జ‌గ‌న్ నియంత పోక‌డ‌లు అంతం కావాలని, మ‌న‌ వ్య‌వ‌స్థ‌ల‌ను కాపాడుకోవాలని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ప్ర‌జ‌లంతా సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు చెప్పారు. ‘ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ గారు… ఈ రోజు ఈ సంవత్సరం ఆఖరి రోజు… ఈ సంవత్సరంలో ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగ పడే పని ఏమి చేశారో కాస్త చెప్పండి జగన్ రెడ్డి గారు.. మీరు బ్లఫ్ మాస్టర్ గా ఎందుకు మిగిలిపోయారో ప్రజలకి చెప్పండి జగన్ రెడ్డి గారు’ అని గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి ట్విట్ట‌ర్‌లో ప్ర‌శ్నించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/