‘ఛలో ఢిల్లీ’..మోడీ స‌ర్కార్ తీరుపై కేజ్రీవాల్ విమర్శలు

Arvind Kejriwal

న్యూఢిల్లీః రైతుల ఛ‌లో ఢిల్లీ ప్ర‌ద‌ర్శ‌న నేపథ్యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కార్ తీరుపై ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ సార‌ధ్యంలోని ఆప్ విరుచుకుప‌డింది. అన్న‌దాత‌ల‌ను జైల్లో నిర్బంధించ‌డం త‌ప్ప‌ని ఆక్షేపించింది. రైతుల ఆందోళ‌న నేప‌ధ్యంలో ఢిల్లీలోని బ‌వానా స్టేడియంను జైలుగా మార్చాల‌న్న కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని తోసిపుచ్చామ‌ని ఆప్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఫిబ్ర‌వ‌రి 13న రైతుల మార్చ్ నేప‌ధ్యంలో నిర‌స‌న‌కారుల‌ను అదుపులోకి తీసుకునేందుకు బ‌వానా స్టేడియాన్ని తాత్కాలిక జైలుగా మార్చాల‌ని కేంద్రం సోమ‌వారం ఢిల్లీ ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. రైతుల డిమాండ్లు న్యాయ‌మైన‌వ‌ని, రాజ్యాంగం ప్ర‌కారం శాంతియుత నిర‌స‌న‌లు చేప‌ట్ట‌డం ప్ర‌తి పౌరుడి హ‌క్క‌ని ఆప్ స్ప‌ష్టం చేసింది.

రైతులు ఈ దేశానికి ఆహారం స‌మ‌కూరుస్తార‌ని, అన్న‌దాత‌ను జైల్లో పెట్ట‌డం త‌ప్ప‌ని ఆప్ పేర్కొంది. ఇక పంజాబ్ నుంచి దేశ రాజ‌ధానికి రైతులు త‌ర‌లివ‌స్తుండ‌టంతో వారిని అడ్డ‌కునేందుకు న‌గ‌ర‌వ్యాప్తంగా వివిధ అంచెల్లో భ‌ద్ర‌తా ఏర్పాట్లు ముమ్మ‌రం చేశారు. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో పెద్ద‌సంఖ్య‌లో బారికేడ్లు, ఇనుప కంచెలు, కంటెయిన‌ర్ వాల్స్ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం, రైతు సంఘాల నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు అసంపూర్తిగా ముగియ‌డంతో రైతులు 13న‌ ఛ‌లో ఢిల్లీ పిలుపు ఇచ్చారు.