వంట సరుకులు, ట్రాలీలలో డీజిల్ సహా ట్రాక్టర్లపై పంజాబ్ రైతుల రాక

punjab-farmers-ready-for-long-haul

న్యూఢిల్లీః పంజాబీ రైతులు ఢిల్లీ దిశ‌గా క‌దులుతున్నారు. వేలాది సంఖ్య‌లో ఉన్న ట్రాక్ట‌ర్ల‌లో వాళ్లు ఢిల్లీ బాట‌ప‌ట్టారు. గ‌తంలో సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మం సాగించిన రైతు సంఘాలు ఇప్పుడు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర చ‌ట్టం కోరుతూ దేశ‌రాజ‌ధానికి వెళ్తున్నారు. ఛ‌లో ఢిల్లీ మార్చ్ కోసం రైతులంతా ప్రిపేర‌య్యారు. క‌నీసం ఆరు నెల‌ల‌కు స‌రిప‌డా ఉన్న రేష‌న్‌తో ట్రాక్ట‌ర్లు బ‌య‌లుదేరుతున్నాయి. అంబాలా-శంభూ, క‌నౌరి-జింద్‌, దాబ్‌వాలీ బోర్డ‌ర్ రూట్లో ఆ ట్రాక్ట‌ర్లు ముందుకు వెళ్తున్నాయి.

ఇవాళ ఉద‌యం 10 గంట‌ల‌కు పంజాబ్‌లోని ఫ‌తేగ‌ర్ సాహిబ్ నుంచి వంద‌ల సంఖ్య‌లో ట్రాక్ట‌ర్లు బ‌య‌లుదేరాయి. వాళ్లంతా శింబూ బోర్డ‌ర్ రూట్లో వెళ్తారు. మ‌రో గ్రూపు మేహ‌ల్ క‌ల‌న్ దారిలో క‌న్నౌరి బోర్డ‌ర్ దిశ‌గా వెళ్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేస్తూ రైతులంతా ఓ కాన్వాయ్‌లా క‌దిలారు. ట్రాక్ట‌ర్ల‌లో యువ‌కులు, మ‌హిళ‌లు, వృద్ధులు ఉన్నారు.

పంజాబీ రైతుల‌ను అడ్డుకునేందుకు హ‌ర్యానాలో ఉన్న బోర్డ‌ర్ ప్ర‌దేశాల వ‌ద్ద సెక్యూర్టీ పెంచారు. అంబాలా, జింద్‌, ఫ‌తేహ్‌బాద్‌, కురుక్షేత్ర‌, సిర్‌సా వ‌ద్ద బోర్డ‌ర్ల‌ను సీజ్ చేశారు. కాంక్రీట్ బ్లాకులు, ఐర‌న్ మేకులు, ఇనుపు వైర్ల‌ను ఫిక్స్ చేశారు. హ‌ర్యానాలోని 15 జిల్లాలో 144 సెక్ష‌న కింద ఆంక్ష‌లు విధించారు.