ప్రశ్నించినందుకు నా రక్తం కళ్ల చూడాలని అనుకుంటున్నారా?: చంద్రబాబు

రాష్ట్రంలో సీఎం తర్వాత అత్యధిక దోపిడీకి పాల్పడింది పెద్దిరెడ్డేనని ఆరోపణ

Chandrababu flays YSRCP govt for neglecting irrigation projects

అమరావతిః రాయలసీమలో నీళ్లు పారించాలని తాము చూస్తుంటే.. రక్తం పారించాలని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు చూస్తున్నారని టిడిపి అధినేత, మాజీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అధికార వైఎస్‌ఆర్‌సిపి అరాచకాలు పరాకాష్ఠకు చేరాయని, ప్రజల్లో ఓపిక నశించి తిరుగుబాటు మొదలైందని అన్నారు. ‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో చంద్రబాబు పర్యటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై పవర్‌‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చెరువుల అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 1,147 ఎకరాల్లో చెరువుల ఆక్రమణ జరిగిందని చెప్పారు.

గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో భారీ అవినీతికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెరలేపారని చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్‌ఆర్‌సిపి పాలనలో సీఎం తర్వాత అత్యధిక దోపిడీకి పాల్పడింది పెద్దిరెడ్డేనని ఆరోపించారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక ఎక్కడిపనులు అక్కడే ఆగిపోయాయని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి అక్రమాలపై జీవోలతో సహా చూపిస్తే తనపై దాడికి పాల్పడుతున్నారని, ‘ప్రశ్నిస్తుంటే నా రక్తం కళ్ల చూడాలని అనుకుంటున్నారా?’ అని నిలదీశారు. వైఎస్‌ఆర్‌సిపి నేతల ఉచ్చులో పడి వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావద్దని పోలీసులకు చంద్రబాబు సూచించారు.