నేరప్రవృత్తికి చెక్ పెట్టలేమా ?

ఆందోళన కలిగిస్తున్న మహిళలపై దారుణాలు

Atrocities against women
Atrocities against women

భారతదేశం అంటే సంస్కృతీ సంప్రదా యాలకు పుట్టినిల్లుగా పదేపదే ఎంతో గొప్పగా చెప్పుకుంటుంటాం. నారీమణులను గౌరవించిన చోట దేవతలు నడియాడతారని, శతాబ్దాలుగా విశ్వసిస్తున్న పుణ్యభూమి మనది. కానీసమాజంలో పూజ్యనీయులైన మహిళల ధన,ప్రాణ రక్షణ విషయంలో చెప్పుకోదగిన గౌరవ మర్యాదలతో ప్రవర్తించలేకపోతున్నాం.

మాటల్లో మాత్రం మహిళా సంక్షేమం, మహిళల భద్రత అంటూ ఎన్నో ఉపన్యాసాలు ఇస్తుంటాం. కానీ చేతల్లో మాత్రం అంతగా కన్పించదు.చట్టసభల్లో మహిళా బిల్లు ఏనాడో అటకెక్కించారు. ఇక రానురాను మహిళల రక్షణ విషయంలో విఫలమవ్ఞతున్నారేమోననిపిస్తున్నది.

జరుగుతున్న సంఘటనలు దీనికి బలంచేకూరుస్తున్నాయి. చట్టం తనపని తాను చేసుకుపోతుందని పాలకులు ఎంతగా చెప్తున్నారో మహిళలపై నేరాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. వాస్తవంగా చదువ్ఞ సంధ్యలు పెరిగే కొద్దీ,విజ్ఞానం ఆర్జించేకొద్దీ మనుషుల ప్రవర్తనలో మార్పు లురావాలి. సంస్కారం, సభ్యత మరింత పెరగాలి.

కానీ దురదృష్టవశాత్తు అందుకు విరుద్ధంగా తిరోగమిస్తున్నామో ననిపిస్తున్నది. మహిళలపై జరుగుతున్న నేరాలు, వేధిం పులు అత్యాచార సంఘటనలు, హత్యలు ఆందోళన కలి గిస్తున్నాయి.

బయటకు చెప్పుకోలేక, అటు పోలీసుస్టేషన్‌ గడప ఎక్కలేక, తమలో తాము కృంగిపోయి ఆత్మహత్య లు చేసుకుంటున్న సంఘటనలు అన్నీఇన్నీకావు.

ఇక కుల, మత,వర్గాలకు అతీతంగా సమాజాన్ని తీర్చిదిద్దేప్రయత్నం ఒకపక్క జరుగుతుంటే మరొకపక్క మూర్తీభవించిన మూఢనమ్మకాలు, కులవ్యవస్థపై ఉన్నభ్రమలతో నేటికీ తల్లిదండ్రులే హత్యలకు పాల్పడుతున్న సంఘటనలు జరుగుతున్నాయి.

ఒకటి, రెండుకాదు. ఇలాంటి సంఘటన లకు అదుపులేకుండాపోతున్నది.ఇక ప్రేమవివాహాలపేరుతో చేస్తున్న మోసాలు అన్నీఇన్నీకావ్ఞ. కొన్ని సందర్భాల్లో మోసపోయిన యువతులు మోసం చేసిన వారి ఇంటి ముందు ధర్నాలు, నిరాహారదీక్షలు చేసిన సంఘటనలు తరుచుగా జరుగుతున్నాయి.

కొందరు మోసపోయినవారు పోలీసుస్టేషన్‌ వెళ్తుంటే మరికొందరు తమలోతాము కుమిలి, కుమిలి ఆత్మహత్యలవైపు మొగ్గుచూపుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో నమ్మించి,మోసంచేసి హత్యలు చేయడానికి కూడా వెనుకాడటం లేదు.

ఆదివారం అలా మోసం చేసి ఒక యువతిని కిరాతకుడు హత్యచేశాడు. హత్యచేసిన వారం రోజుల తర్వాత కానీ విషయం బయ టకురాలేదు.భువనగిరి జిల్లాలో జరిగిన ఈ దారుణసంఘ టన అందరిని కలిచివేసింది.

ప్రేమపేరుతో ఆ యువతిని నమ్మించి ఒకపథకం ప్రకారం నిర్జన ప్రదేశానికి తీసుకు వెళ్లి తన స్నేహితుడితో కలిసి అత్యాచారం చేసి ఆ తర్వాత ఆమె చున్నీనే మెడచుట్టూ చుట్టి ఊపిరాడకుండా చేసి ఇద్దరు కిరాతకులు కలిసి హత్య చేశారు. కన్పించకుండాపోయిన ఆ యువతి తల్లిదండ్రులు ఆగస్టు 19వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.నిన్న ఆమె మృతదేహాన్నికుళ్లిపోయిన పరిస్థితిలో కొనుగొన్నారు. ఆ యువకుని మృతదేహం కూడా బయటపడింది. అయితే ఇది ఆత్మహత్య లేక హత్య అనే విషయంలో పోలీసులు గాలింపులు చేస్తున్నా రు.

ఆంధ్రప్రదేశ్‌ గుంటూరులో ఒక వివాహిత తన తొమ్మిదినెలల పాపను ఐదంతస్తుల భవనం నుండి కిందికి వేసి తాను కూడా దూకి చనిపోయింది. భర్తతోపాటు అత్తంటివారి వేధింపులే కారణమంటున్నారు. ఇది ఆత్మ హత్యకాదని,చంపి, ఆ తర్వాత ఆ భవనం నుంచి కిందికి పడేశారని ఆమె తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు.పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తుచేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి.

కోరిక తీర్చలేదని కొందరు, ప్రేమ అంగీకరించలేదని మరికొంద రు, పగబట్టి మట్టుబెడుతున్నారు. ఇక వేధింపుల గూర్చి చెప్పక్కర్లేదు.

ఈ విషసంస్కృతి దేశవ్యాప్తంగా పెరిగిపో తుందనేందుకు కారణం ప్రభుత్వరికార్డులే అద్దంపడుతు న్నాయి.

చాలావరకు పోలీసు రికార్డుల్లోకి కూడా ఎక్కే అవకాశాలు తక్కువ. ఏ యువతి తానువేధింపులకు గుర వ్వుతున్నానని పోలీసుస్టేషన్‌ మెట్లెక్కి ఫిర్యాదు చేయడానికి సాహసించడం లేదు. పోలీసులు వేసే సవాలక్ష ప్రశ్నలకు జవాబులు చెప్పడం, సాక్ష్యాలతోరుజువ్ఞ చేయడం అయ్యే పనికాదు.

ఒకవేళ అన్ని సమకూర్చినా వారు తీసుకునే చర్యలతో ఈ వేధింపులు ఆగిపోతాయని ఏ ఆడపిల్ల నమ్మే పరిస్థితుల్లో లేదు.

గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన షీ టీమ్స్‌ కొంతమేరకు మంచి ఫలితాలు సాధిస్తున్నాయి.అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యా యి.

మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, బలత్కారాలు, వెంటపడి వేధించే కీచకులు పెచ్చరిల్లిపోతున్నారు.

దేశంలో అత్యాచారాల పరిస్థితి పరిశీలిస్తే నేరస్తులను కట్టడి చేయలేని నిస్సహాయస్థితి చూస్తే ఈ నేరాలు ఇప్పట్లో కట్టడి చేయలేమేమోననిపిస్తున్నది.

నిర్భయ చట్టం తర్వాత కొంత మార్పువస్తుందని ఆశించారు. కానీ అవన్నీ అడియాశలే అయ్యాయి. అలాని పాలకులు ఏమి చేయడం లేదని చెప్పడం లేదు. చట్టాల మీద చట్టాలు చేస్తున్నారు. అయినా ఆశించిన ప్రయోజనాలు కలగడం లేదు.

ప్రజల్లో కూడా చట్టాలు, అధికారులపై క్రమేపీ విశ్వాసం సన్నగిల్లుతోంది.

కన్నుకు కన్ను, కాలుకు కాలు, ప్రాణానికి ప్రాణం అనే ఆటవీక సిద్ధాంతమే సరైన పరిష్కారమేమోననే వాదన బయలు దేరింది.అది ఏమాత్రం సమంజసంకాదు.

అది అరాచకానికి దారి తీస్తుంది. కేంద్ర, రాష్ట్ర పాలకులు చట్టాలు చేసి చేతులు దులుపుకోకుండా ఆచరణకు త్రికరణశుద్ధిగా ప్రయత్నం చేయాలి.

ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా భారతావనిలో మహిళల భద్రత ప్రశ్నార్థకమవ్ఞ తుంది. ఇది దేశానికి ఏమాత్రం క్షేమంకాదు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/