సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపిన ప్రపంచ బ్యాంకు డైరెక్టర్

ప్రపంచ బ్యాంకు భారత విభాగం డైరెక్టర్ అగస్టే కౌమే..సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం సీఎం జగన్ తో ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. భారత్ లో ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ అగస్తే టోనో కౌమే నేతృత్వంలో బృందం జగన్ ను కలిసింది. ఏపీలో వరల్డ్ బ్యాంకు భాగస్వామ్యంతో నడుస్తున్న పలు పథకాల అమలుపై వారు సీఎం జగన్ తో చర్చించారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకువస్తున్నామని, పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నామని సీఎం జగన్ వరల్డ్ బ్యాంకు బృందంతో చెప్పారు. రాష్ట్రాభివృద్ధి దిశగా ప్రపంచ బ్యాంకు మరింత సహకారం అందించాలని కోరారు.

ఈ సందర్భంగా అగస్టే మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి అన్నారు. వివిధ రంగాల్లో ప్రభుత్వం చేరుకున్న లక్ష్యాలను ప్రత్యక్షంగా మేం చూశామన్నారు. ఒక ప్రభుత్వం తన ప్రజలకు ఏ విధంగా సేవలు అందించగలదనే దానికి ఏపీ ఉదాహరణగా నిలిచిందని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలియజేశారు. ప్రజలకు మంచి వైద్యం, ఆరోగ్యం, విద్యను ఎలా అందించవచ్చనే దానికి సీఎం జగన్ చక్కటి మార్గాన్ని చూపించారన్నారు. నిర్దేశిత సమయంలోగా పౌరులకు సేవలను అందించడంలో గొప్ప ఉదాహరణగా నిలిచారని పేర్కొన్నారు. భారతదేశంలోని దాదాపు 22 రాష్ట్రాలకు తాము రుణాలు ఇస్తున్నామని అగస్టే తెలిపారు. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు ఏపీని ఒక ఉదాహరణగా తీసుకుని ముందుకుసాగవచ్చన్నారు. వణుకూరు, భవానీపురం, వెనిగండ్ల ప్రాంతాల్లో తాను పర్యటించానని, ఆరోగ్యం, విద్య అంశాల్లో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న అభివృద్ధి చర్యలను కళ్లారా చూశానని కౌమే వెల్లడించారు. ఏపీ సుస్థిర భవిష్యత్తు పెట్టుబడులకు అభివృద్ధి, అధిక రెవెన్యూ తోడ్పడతాయని వివరించారు.