కొడుకు చదువు కోసం అమ్మ ‘ప్రాణ త్యాగం’

కన్న బిడ్డ కోసం కన్న తల్లి తన ప్రాణాలే విడిచిన ఘటన తమిళనాడు లో చోటుచేసుకుంది. ఈ ఘటన గత నెలలో చోటుచేసుకోగా..ఆలస్యంగా ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రమాదంలో తాను చనిపోతే ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని, ఆ సొమ్ముతో తన కొడుకు చదువుకోవచ్చని ఆ తల్లి భావించి ప్రాణ త్యాగం చేసింది.

వివరాల్లోకి వెళ్తే..

సేలం పట్టణానికి చెందిన పాపాతీ (46) అనే మహిళ కలెక్టర్ ఆఫీసులో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమెకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తె డిగ్రీ పూర్తిచేయగా.. కుమారుడు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. తన కొడుకు కాలేజీ ఫీజు కట్టడానికి రూ. 45,000 అవసరం కాగా.. అప్పు కోసం ఎంతగా ట్రై చేసిన అప్పు దొరకలేదు. ఎలాగైనా కొడుకు మంచి చదువు చదివి ప్రయోజకుడు కావాలని భావించింది. పారిశుధ్య కార్మికుడు ప్రమాదవశాత్తు చనిపోతే కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లిస్తుందని భావించిన ఆమె ఆత్మహత్య చేసుకొని , ఆ డబ్బుతో కొడుకు చదువుకోవాలని అనుకుంది.

జూన్ 28న ఆమె సేలం అగ్రహారం వీధి వద్ద ముందుగా ఓ బస్సుకు ఎదురెళ్లడానికి ప్రయత్నించగా.. ఇంతలో ఓ ద్విచక్రవాహనం ఆమె ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో పక్కన పడిపోయింది. తర్వాత కొద్ది నిమిషాలకు రెండోసారి మరో బస్సుకు ఎదురెళ్లి ఆత్మ హత్య చేసుకుంది. ఈ ఘటన తర్వాత అంత బస్సు డ్రైవర్ నిర్లక్షంగా ఆమెను ఢీ కొట్టాడని భావించారు. కానీ అక్కడి సీసీ కెమెరా ఫుటేజ్ చూసిన తర్వాత ఈమె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని పోలీసులు నిర్దారణకు వచ్చారు. అసలు ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుందని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది.

https://twitter.com/AhmedKhabeer_/status/1681166084836302848?s=20