హైదరాబాద్ లో దారుణం : బీర్ కోసం యువకుడి హత్య

మద్యం మత్తు ఎంతకైనా తెగించేలా చేస్తుందనడానికి ఇదొక ఉదాహరణ. బీర్ కోసం యువకుడ్ని హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే..

సాయి వరప్రసాద్ అనే యువకుడు జిల్లెలగూడలోని ఒక వైన్ షాపులో బీర్ బాటిళ్లు కొనుక్కుని తీసుకెళ్తున్నాడు. అయితే మార్గం మధ్యలో అతడిని పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ కుమార్ అనే ముగ్గురు యువకులు అడ్డుకున్నారు. బీర్ బాటిళ్లు తమకు ఇచ్చేసి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో తాను ఎందుకు ఇవ్వాలని వరప్రసాద్ ఎదురుతిరిగాడు. ఈ క్రమంలో అతడితో ముగ్గురు యువకులు కలిసి వాగ్వాదానికి దిగారు. గొడవ మరింత పెరగడంతో వరప్రసాద్‌పై యువకులు కత్తులతో దాడికి పాల్పడ్డారు.

ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలై ఘటనా స్థాలంలోనే రక్తపు మడుగులో పడిపోయాడు. అటుగా వెళ్తున్న స్థానికులు దీనిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వరప్రసాద్‌కు ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే మృతి చెందాడు. దీంతో అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మీర్‌పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా హత్యకు పాల్పడ్డ ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు.