తెలంగాణ లో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. గ్రూప్-1, గ్రూప్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను సోమవారం విడుదల చేసింది. ఉద్యోగ నియామకాలకు సంబంధించి పోస్టుల వర్గీకరణ, పరీక్షా విధానాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు విధివిధానాలు స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు రద్దు చేసిన నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిపాదనలకు అనుగుణంగా కొన్ని సవరణలు చేశారు. టీఎస్​పీఎస్సీ సవరణలను పొందుపరుస్తూ అన్ని అంశాలతో సాధారణ పరిపాలనాశాఖ వివరణాత్మక ఉత్తర్వును జారీ చేసింది. గ్రూప్-1లో 19 ర‌కాల పోస్టులు, గ్రూప్-2లో 16 ర‌కాల పోస్టులు కేటాయించిన‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న‌ది. గ్రూప్-1 పోస్టుల‌కు 900 మార్కుల‌తో, గ్రూప్-2 పోస్టుల‌కు 600 మార్కుల‌కు రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపింది.

గ్రూప్‌-3లో 8 ర‌కాల పోస్టులు, 450 మార్కుల‌తో రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. గ్రూప్‌-4లో జూనియ‌ర్ అసిస్టెంట్, జూనియ‌ర్ అకౌంటెంట్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. గ్రూప్-4కు సంబంధించి 300 మార్కుల‌కు రాత‌ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీస‌ర్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీతో పాటు మ‌రిన్ని పోస్టుల‌కు సిల‌బ‌స్, మార్కుల‌ను కూడా ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో నియామక పరీక్షలు నిర్వహిస్తారు.