హైదరాబాద్‌లో వర్షాలు..అధికారులు అప్రమత్తంగా ఉండాలిః జీహెచ్‌ఎంసీ మేయర్‌

heavy-rains-in-hyderabad-ghmc-mayor-gadwal-vijayalakshmi-alert-officials

హైదరాబాద్‌: భారీ వర్షాల దృష్ట్యా జీహెచ్‌ఎంసీ సిబ్బంది, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి సూచించారు. జోనల్‌ కమిషనర్లు, ఈవీడీఎం సిబ్బంది నిరంతరం పరిస్థితులను సమీక్షించాలన్నారు. వరదను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో కొత్త సెల్లార్‌ తవ్వకాలను అనుమతించకూడదని చెప్పారు. ప్రజలు తమకు ఎలాంటి మస్యలు ఉన్నా 040-21111111 నంబర్‌కు ఫోన్‌ చేయాలన్నారు.

హైదరాబాద్‌ వ్యాప్తంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో పలు చోట్ల రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. అయితే జీహెచ్‌ఎంసీ సిబ్బంది వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లిపోయేలా చూస్తున్నారు. కాగా, సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం రాత్రి వరకు భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు మరికొన్ని జిల్లాల్లో అతిభారీ వర్షాల నేపథ్యంలో ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. బుధవారం నుంచి గురువారం సాయంత్రం వరకు ఆసిఫాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షాలు ఉంటాయని ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.