ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎఫెక్ట్ : మూడు జిల్లాల్లో 2 రోజులు వైన్స్ బంద్

Bad news for liquor lovers.. Wine shops are closed for 24 hours

తెలంగాణలో ఈనెల 27న వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. 2021లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ తరఫున అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో పట్టభద్రుల ఉపఎన్నిక అనివార్యమైంది. ఈ పోరులో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, గులాబీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా ఏనుగుల రాకేశ్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రచార సమయం ముగింపుకు చేరుకోవడం తో అన్ని పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల ఫై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇక పోలింగ్ కు కొద్దీ గంటల సమయం మాత్రమే ఉండడంతో ఈ మూడు జిల్లాల్లో ఈనెల 25 సాయంత్రం 4 గంటల నుంచి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్స్, బార్లు బంద్ చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే యజమానులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.