తొలిదశ ఉద్య‌మంలో 370 మందిని కాల్చి చంపింది ఎవరు?: కేటీఆర్

ktr

హైదరాబాద్‌ః మాజీ మంత్రి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా మ‌రోసారి కాంగ్రెస్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. “ప్ర‌త్యేక రాష్ట్రం ప‌దేళ్లు తాత్సారం చేసి వంద‌లాది మంది ఆత్మ‌బ‌లిదానానికి కార‌ణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం.1952లో ఉమ్మడి రాష్ట్రం వద్దని, హైదరాబాద్ స్టేట్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని పోరాటం చేస్తున్న విద్యార్ధులపై సిటీ కాలేజీ వద్ద కాల్పులు జరిపి ఆరుగురిని బలిగొన్నది ఎవరు? కాంగ్రెస్ ప్ర‌భుత్వం. 1969-71 తొలిదశ ఉద్య‌మంలో 370 మందిని కాల్చి చంపింది ఎవరు? కాంగ్రెస్ ప్ర‌భుత్వం.

దేశంలో ఎక్కడలేని విధంగా ప్రజాస్వామికంగా, తమ ఆకాంక్షను వ్యక్తం చేస్తే, తెలంగాణను తుంగలో తొక్కింది ఎవరు? కాంగ్రెస్ ప్ర‌భుత్వం. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పినట్టు, వేలాది తెలంగాణ బిడ్డలను చంపిన బలిదేవత ఎవరు?” అని ప్ర‌శ్నిస్తూ అమ‌ర‌వీరుల స్తూపం ఫొటోను పోస్ట్ చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట్ వైర‌ల్ అవుతోంది.