అభిమానులకు ట్రంప్ సర్‌ప్రైజ్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ట్రంప్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం తన అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. హాస్పిటల్ బయట వేచి చూస్తున్న తన మద్దతుదారులను పలకరించేందుకు ఓ యూఎస్‌యూవీ కారులో బయటకు వెళ్లారు. మాస్క్ ధరించిన ట్రంప్ తన అభిమానుల్ని కారులో నుంచి సంకేతాలతో పలుకరించారు. అయితే కోవిడ్ లక్షణాలతో ట్రంప్ కారులో బయటకు వెళ్లడం పట్ల నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అలా చేయడం వల్ల ఆయన సిబ్బందికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాధి తీవ్రమైనదే అయినా.. ట్రంప్ మాత్రం ఫోటోషూట్ స్టయిల్‌లో హాస్పిటల్ బయట తిరగడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
కాగా హాస్పిటల్‌లో ఉన్న ట్రంప్ ఓ ట్వీట్ లో కోవిడ్ గురించి ఎంతో నేర్చుకున్నట్లు తెలిపారు. స్కూల్‌కు వెళ్లి కోవిడ్ గురించి నేర్చుకున్నానన్నారు. ఇదే రియల్ స్కూల్ అని తెలిపారు. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉందని, దీని గురించి మీకు పూర్తిగా తెలియజేస్తానని అన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/