45 గంట‌ల పాటు ధ్యానం చేయ‌నున్న ప్రధాని మోడీ

Prime Minister Modi will meditate for 45 hours

న్యూఢిల్లీః సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వివేకానంద రాక్‌ మెమోరియల్‌ వద్ద సుదీర్ఘ ధ్యానం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6:45 గంటల నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టారు. సుమారు 45 గంట‌ల పాటు మోడీ ధ్యానం చేయ‌నున్నారు.

ఇక, ఈ 45 గంటలూ మోడీ కేవలం లిక్విడ్‌ డైట్‌ ను పాటించనున్నారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం, ఇతర ద్రవ పదార్థాలను మాత్రమే స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మెడిటేషన్‌ సందర్భంగా మోడీ మౌనంగా ఉంటారని, ధ్యాన మందిరం దాటి బయటకు అడుగు పెట్టరని జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు కాషాయ దుస్తులు ధరించి ప్రశాంత వాతావరణంలో మోడీ ధ్యానం చేస్తున్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. మోడీ పర్యటన నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల కిందట 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కేదార్‌నాథ్‌ సందర్శించారు. 2014లో ఆయన మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు సంబంధించిన ప్రతాప్‌గఢ్‌కు వెళ్లారు. ప్రధాని ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం పంజాబ్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న మోడీ.. సరాసరి ప్రత్యేక హెలికాప్టర్‌లో కన్యాకుమారి చేరుకున్నారు. ముందుగా శ్రీ భ‌గ‌వ‌తీ అమ్మన్ ఆల‌యంలో ప్రత్యేక పూజ‌లు చేశారు. అనంతరం ఓ పడవలో బయలు దేరి సముద్రం మధ్యలో ఉన్న శిలాస్మారకాన్ని చేరుకున్నారు. అక్కడ రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు.