ఐరాసలో పాకిస్థాన్ కు చురకలంటించిన భారత్

న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితి స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో కశ్మీర్ అంశాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తావించడంతో భారత్ దీటుగా కౌంటర్ ఇచ్చింది. పాక్ ప్ర‌ధాని చేసిన వ్యాఖ్యల‌కు యూఎన్‌లోని భార‌త ప్ర‌తినిధి స్నేహ దూబే తీవ్రంగా ఖండించారు. జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌డాఖ్‌లు ఎప్ప‌టికీ భారత్ లోనే భాగ‌మ‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌డాఖ్‌ల‌ను భారత్ నుంచి ఎవ‌రూ వేరు చేయ‌లేరని తేల్చి చెప్పారు. ఉగ్ర‌వాదుల‌కు పాకిస్థాన్ అడ్డాగా మారుతోంద‌ని ఆరోపించారు. ఉగ్ర‌వాదుల‌ను పాక్ పెంచి పోషిస్తోందని తెలిపారు.

ఉగ్రవాదులకు మద్దతివ్వడం, సహకరించడం, ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ పాత్ర గురించి ఐరాసలో సభ్యదేశాలకు తెలుసు అని వ్యాఖ్యానించారు. బహిరంగంగా ఉగ్రవాదులకు మద్దతు, శిక్షణ, ఆర్ధిక, ఆయుధాలు సమకూర్చడమనేది ప్రభుత్వ విధానంగా పెట్టుకున్న ఏకైక దేశం పాక్ అనేది ప్రపంచం గుర్తించిందని చెప్పారు. ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థానే ఆశ్ర‌యం ఇచ్చింద‌న్నారు. పాక్ అవ‌లంబిస్తున్న విధానాల వ‌ల్లే ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారని దూబే ఆరోపించారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/