తమిళనాడు సీఎం బుల్లెట్ రైలు ప్రయాణం..రెండున్నర గంటల్లోనే 500 కిలోమీటర్లు

రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు టూర్

cm-stalin-takes-bullet-train-ride-in-japan

చెన్నైః తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. రైలు వేగానికి అబ్బురపడ్డ సీఎం తన అనుభవాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. జపాన్‌లోని ఒసాకా నగరం నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని టోక్యో నగరానికి కేవలం రెండున్నర గంటల్లోపే చేరుకున్నారు. తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసిన సీఎం, ఇలాంటి రైలు సర్వీసులు భారతీయ పౌరులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు.

‘‘ఒసాకా నుంచి టోక్యోకు బుల్లెట్ రైలులో ప్రయాణం చేశా. దాదాపు రెండున్నర గంటల్లోపే 500 కిలోమీటర్ల మేర ప్రయాణించా’’ అంటూ ఆయన తన జర్నీ ఫొటోలు, విశేషాలు షేర్ చేశారు. తమిళనాడు రాష్ట్రంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు స్టాలిన్.. సింగపూర్, జపాన్ నగరాల్లో పర్యటిస్తున్నారు. బుల్లెట్ రైలు వేగం, నాణ్యతతో కూడిన ప్రయాణ సదుపాయాలు భారత్‌లోనూ రావాలని అభిప్రాయపడ్డారు. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలగడంతో పాటూ వారి ప్రయాణాలు సులభతరం కావాలని ఆకాంక్షించారు. #futureindia హ్యాష్‌ట్యాగ్‌తో ఈ మేరకు ట్వీట్ చేశారు.