నేటితో వంద రోజుల మార్కు దాటిన భట్టి విక్రమార్క పాదయాత్ర

కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్న భట్టి పాదయాత్ర

bhatti-vikramarka-padayatra-crosses-100-days-milestone

హైదరాబాద్‌ః కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర శుక్రవారానికి వంద రోజుల మైలురాయికి చేరుకుంది. భట్టి విక్రమార్క మార్చి 16న ఆదిలాబాద్ జిల్లాలో యాత్ర ప్రారంభించారు. ఇప్పటివరకు 15 జిల్లాల్లోని 32 శాసనసభ నియోజకవర్గాల మీదుగా సాగుతూ 1150 కిలోమీటర్లు దాటింది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోని కేతేపల్లి మండలంలో పాదయాత్ర కొనసాగుతుండగా మంగళవారం ఆయన అస్వస్థతకు గురయ్యారు. వైద్యుల చికిత్స, సూచనల మేరకు రెండురోజులు పాదయాత్ర వాయిదా వేశారు. తిరిగి ఈ రోజు ఈ ఉదయం కేతేపల్లి నుంచి భట్టి పాదయాత్ర ప్రారంభించారు.

యాత్ర 100వ రోజు మార్కు చేరడంతో కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేస్తున్నారు. భట్టి పాదయాత్ర ఆయా జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నిలిపింది. నేతల మధ్య ఐక్యత తెచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ యాత్రకు మంచి స్పందన రావడం హైకమాండ్ ను కూడా ఆకర్షించింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు యాత్రలో పాల్గొన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ సైతం భట్టి యాత్రపై ఆరా తీసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.