ప్రజల కోసం తాము జైలుకెళ్లేందుకైనా సిద్ధమే..దమ్ముంటే అరెస్టు చేసుకోండి: భూమిరెడ్డి

రాష్ట్రంలో పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి

అమరావతిః రాష్ట్రంలో పోలీసుల తీరు చాలా దారుణంగా ఉందని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సహా తామంతా విజయనగరంలో ఉన్నామని, దమ్ముంటే అరెస్టు చేసుకోవచ్చని సవాల్ చేశారు. అంగళ్లు ఘర్షణలకు సంబంధించి చంద్రబాబు, పలువురు నేతలపై కేసులు నమోదు చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.

ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక తేవాలని చంద్రబాబు పర్యటిస్తున్నారని, ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నేతలు దాడులు చేస్తున్నారని ఆరోపించారు. కానీ కేసులు తమపై పెడుతున్నారని మండిపడ్డారు. అంగళ్లు దాడులకు పోలీసులే సాక్ష్యమని, వారికీ దెబ్బలు తగిలాయని చెప్పారు. అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం తాము జైలుకెళ్లేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. చంద్రబాబు సహా టిడిపి నేతలపై నమోదైన కేసులను న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్పారు.