నింగికెగసిన రష్యా రాకెట్…ఇస్రో కంటే 2 రోజుల ముందే జాబిల్లిపై ల్యాండింగ్

దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు లూనా-25 రాకెట్ ప్రయోగం

Russia Sends Spacecraft To Moon, Weeks After Chandrayaan-3 Launch

మాస్కోః సుమారు అర్ధశతాబ్దం క్రితం అంతరీక్ష రంగంలో అగ్రగామిగా వెలుగొందిన రష్యా మరోసారి సారి తన సత్తా ప్రపంచానికి చాటేందుకు సిద్ధమైంది. చంద్రుడి దక్షిణ ధృవపు రహస్యాలను వెలికితీసేందుకు చంద్రయాన్ తరహాలో తాజాగా లూనా-25 రాకెట్‌ను ప్రయోగించింది. రష్యా కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 2.00 గంటలకు వాస్టోక్నీ కాస్మోడ్రోమ్ నుంచి లూనా-25 నిప్పులు కక్కుతూ నింగికెగసింది.

రష్యా అంతరీక్ష సంస్థ రాస్‌కాస్మొనాస్ ప్రకటన ప్రకారం, మరో ఐదు రోజుల్లో ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యను చేరుకుంటుంది. అనంతరం, జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగేందుకు అనువైన ప్రదేశం కోసం కొన్ని రోజుల పాటు అన్వేషించి అనంతరం చంద్రుడిపై దిగుతుంది. ఆగస్టు 21న ఈ వ్యోమనౌక చంద్రుడిపై దిగే అవకాశం ఉందని రాస్‌కాస్మొనాస్ నిపుణుల పేర్కొన్నారు. అంతా సవ్యంగా జరిగితే ఏడాది పాటు ఈ వ్యోమౌనక చంద్రుడిపై ప్రయోగాలు చేపడుతుంది. జాబిల్లిపై మట్టిని సేకరించి పరీక్షిస్తుంది. అనేక దీర్ఘకాలిక పరిశోధనలు కూడా చేపడుతుందని రష్యా అంతరిక్ష సంస్థ పేర్కొంది. సోవియట్ యూనియన్ అనంతర కాలంలో రష్యా ఇలాంటి ప్రయత్నం చేయడం ఇదే తొలిసారి అని అక్కడి నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు.

రష్యా అంతరిక్ష రంగానికి కొత్త ఊపు ఇవ్వడంతో పాటూ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఒంటరవుతున్న దేశంలో ఒ కొత్త ఉత్సాహం నింపేందుకు ఈ ప్రయోగం జరుగుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 కూడా జాబిల్లి వైపు దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇస్రో ప్రణాళిక ప్రకారం చంద్రయాన్-3 ఆగస్టు 23న జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగుతుంది. మరోవైపు, లూనా-25ని విజయవంతంగా ప్రయోగించిన రాసకాస్మొనాస్‌ను అభినందిస్తూ ఇస్రో ట్వీట్ చేసింది.