జగన్ గ్రామ స్వరాజ్యాన్నితీసుకొచ్చారుః మంత్రి రోజా

వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి 175 సీట్లు గెల్చుకుంటుందన్న రోజా

volunteers-are-true-welfare-servants-says-minister-rk-roja

అమరావతిః అమరావతిలో పేదలకు ఇచ్చే సెంటు స్థలాన్ని చంద్రబాబు నాయుడు సమాధులతో పోల్చడాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా ఖండించారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. పేదలకు ఇచ్చే స్థలాన్ని సమాధులతో పోల్చడాన్ని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 స్థానాలను వైఎస్‌ఆర్‌సిపి గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో వరుసగా మూడో ఏడాది కూడా పాల్గొనడం సంతోషంగా ఉందని చెప్పారు.

అనంతరం పలువురు వాలంటీర్లను సత్కరించారు. వాలంటీర్లు సంక్షేమ సేవకులని, వెలకట్టలేని సేవలు అందిస్తున్నారని మంత్రి మెచ్చుకున్నారు. వాలంటీర్ వ్యవస్థతో సరికొత్త మార్పును తెచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని చెప్పారు. ప్రజలంతా వాలంటీర్ వ్యవస్థను మెచ్చుకుంటుంటే చంద్రబాబు మాత్రమే రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి చెప్పారు. గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చారని, సమసమాజ స్థాపన కోసం పాటుపడుతున్నారని సీఎం జగన్ పై మంత్రి రోజా ప్రశంసల వర్షం కురిపించారు.