మోడీని ప్రశంసించిన వ్లాదిమిర్ పుతిన్

విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ ప్రయత్నాలపైనా ప్రశంసలు

‘Visible effect on Indian economy’: Putin hails PM Modi’s ‘Make in India’ initiative

మాస్కోః భారత ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని ప్రవేశపెట్టిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం ప్రజలపై అద్భుతమైన ప్రభావం చూపించిందని కొనియాడారు. రష్యాకు చెందిన ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనీషియేటివ్స్ ఇటీవల ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పుతిన్ ప్రసంగించారు. దేశీయంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్న దేశాల గురించి ప్రస్తావిస్తూ పుతిన్ భారత్ గురించి పేర్కొన్నారు.

‘‘ఇండియాలో మన ఫ్రెండ్స్, ముఖ్యంగా మిత్రుడు నరేంద్ర మోడీ కొన్నేళ్ల క్రితమే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. భారత ఆర్థికరంగంపై ఇది గొప్ప ప్రభావం చూపించింది. మనం కూడా ఇలాగే చేయడంలో తప్పేమీ లేదు’’ అని పుతిన్ వ్యాఖ్యానించారు. భారత్‌లా దేశీఉత్పత్తులు, బ్రాండ్‌లను ప్రోత్సహించాలన్న పుతిన్.. రష్యా కంపెనీలు మరింత సమర్థవంతంగా పని చేసేందుకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు. దేశీ తయారీ రంగ సామర్థ్యాన్ని పెంచేందుకు, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు భారత్ అనుసరిస్తున్న విధానాలను ఆయన ప్రశంసించారు.