చంద్రబాబు పాలనలో ప్రజలకు ఎంత మేలు జరిగిందనే దానిపై చర్చకు రావాలిః జోగి రమేశ్

‘ప్రకాశించని నవరత్నాలు.. జగన్ మోసపు లీలలు’ పుస్తకాన్ని విడుదల చేసిన టీడీపీ

jogi-ramesh-challenge-to-atchannaidu

అమరావతిః సిఎం జగన్ ఇచ్చిన హామీలపై టిడిపి ‘ప్రకాశించని నవరత్నాలు.. జగన్ మోసపు లీలలు’ అనే పుస్తకాన్ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. పుస్తకాన్ని విడుదల చేస్తున్న సమయంలో జగన్, వైఎస్‌ఆర్‌సిపి పై ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, అచ్చెన్న వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. వైఎస్‌ఆర్‌సిపి మేనిఫెస్టోపై అచ్చెన్నాయుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. అచ్చెన్నకు దమ్ముంటే కుప్పంలోనైనా, టెక్కలిలోనైనా చర్చకు రావాలని సవాల్ విసిరారు.

చంద్రబాబు పాలనలో ఏం హామీలు ఇచ్చారో, ప్రజలకు ఎంత మేలు జరిగిందో చర్చించడానికి రావాలని జోగి రమేశ్ ఛాలెంజ్ చేశారు. ప్లేస్ మీరే డిసైడ్ చేయండని సవాల్ విసిరారు. టిడిపి రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏమిటో మీకైనా గుర్తుందా? అని ప్రశ్నించారు. టిడిపి మేనిఫెస్టో కాపీ వారి వెబ్ సైట్ లో కూడా లేదని ఎద్దేవా చేశారు. తమ మేనిఫెస్టో గురించి అచ్చెన్నాయుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ 98 శాతం హామీలను నెరవేర్చారని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యేలందరూ గడపగడపకూ తిరుగుతూ సంక్షేమ పథకాల అమలు గురించి తెలుసుకుంటున్నారని చెప్పారు. తమది ప్రజా సంక్షేమ ప్రభుత్వమని అన్నారు.