ఒడిశా షాపింగ్‌ కాంప్లెక్స్‌ భారీ అగ్నిప్రమాదం..

ఒడిశాలోని పూరీ జిల్లాలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పూరిలో ఉన్న లక్ష్మీ మార్కెట్‌ కాంప్లెక్స్‌లో బుధవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా కాంప్లెక్స్‌ మొత్తానికి విస్తరించాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. కాంప్లెక్స్‌లో చిక్కుకుపోయిన 100 మందిని రక్షించారు. గాయపడినవారిని హాస్పటల్ కు తరలించారు. జగన్నాథ ఆలయానికి సమీపంలో ఉన్న ఈ భవనంలో రెండు వేర్వేరు అంతస్తుల్లో హోటల్, బ్యాంకు ఉన్నాయి.

మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన 100 మంది పర్యాటకులను హోటల్ నుంచి అధికారులు సురక్షితంగా రక్షించారు. ఇక, భవనం పైభాగంలో ఇరుక్కుపోయిన ముగ్గురు వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది అపస్మారక స్థితిలో రక్షించారని అధికారులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ముగ్గురు సిబ్బంది వేడి, పొగ కారణంగా అస్వస్థతకు గురయ్యారని, వారిని ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ ఎస్‌కే ఉపాధ్యాయ తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ.. మంటలు సమీపంలోని భవనాలకు వ్యాపించాయని కూడా ఆయన పేర్కొన్నారు.