ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రిగా విష్ణు డియో సాయ్ ప్ర‌మాణ‌స్వీకారం

Vishnu Deo Sai Takes Oath As Chhattisgarh Chief Minister

రాయ్‌పూర్ : ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రిగా విష్ణు డియో సాయ్ ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంలుగా అరుణ్ సావో, విజ‌య్ శ‌ర్మ కూడా ప్ర‌మాణం చేశారు. రాయ్‌పూర్‌లో జ‌రిగిన ఈ ప్ర‌మాణ‌స్వీకార కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి చీఫ్ జేపీ న‌డ్డా, యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌, అసోం సీఎం హిమంత బిస్వా శ‌ర్మ‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్ మాజీ సీఎం భూపేష్ భ‌గేల్‌తో పాటు ప‌లువురు నాయ‌కులు హాజ‌ర‌య్యారు.

విష్ణు డియో సాయ్‌ గతంలో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా పనిచేశారు. అంతేగాక ప్రధాని నరేంద్రమోడీ తొలి క్యాబినెట్‌లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. మొత్తం 90 స్థానాలకుగాను నవంబర్‌ 7, 17 తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్‌ నిర్వహించారు. డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బిజెపి 54 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ 35 స్థానాలకే పరిమితమై అధికారాన్ని కోల్పోయింది.