సెంట్ర‌ల్ మెక్సికోలో కాల్పుల్లో 19 మంది మృతి

మెక్సికో : సెంట్ర‌ల్ మెక్సికోలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 19 మంది మ‌ర‌ణించార‌ని స్టేట్ అటార్నీ జ‌న‌ర‌ల్ కార్యాల‌యం (ఎఫ్‌జీఈ) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మికోక‌న్ స్టేట్ లాస్ టిన‌జాస్ ప‌ట్ట‌ణంలో ఆదివారం ఓ ఉత్స‌వం కోసం గుమికూడిన వారిపై దాడి జ‌రిగింద‌ని అధికారులు పేర్కొన్నారు. ముగ్గురు మ‌హిళ‌లు, 16 మంది పురుషులు స‌హా 19 మృత‌దేహాలు ల‌భ్య‌మ‌య్యాయ‌ని తెలిపారు. మృత‌దేహాల‌పై కాల్పుల గాయాలున్నాయ‌ని ఎఫ్‌జీఈ పేర్కొంది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురు క్ష‌తగాత్రుల‌ను అధికారులు ఆస్ప‌త్రుల‌కు త‌ల‌రించారు. కాల్పుల‌కు గ‌ల కార‌ణాల‌పై అధికారులు ఎలాంటి వివ‌రాలు వెల్ల‌డించలేదు. ఇక మికోక‌న్‌, గున‌జుటో మెక్సికోలోనే అత్యంత హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకునే ప‌ట్ట‌ణాలుగా గుర్తింపు పొందాయి.

డ్ర‌గ్ ట్రాఫికింగ్ స‌హా ప‌లు చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డే ప్ర‌త్య‌ర్ధి ముఠాల మ‌ధ్య త‌ర‌చూ ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్తుతుంటాయి. 2006లో కేంద్ర బ‌ల‌గాల‌తో ప్ర‌భుత్వం యాంటీ డ్ర‌గ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి మెక్సికో డ్ర‌గ్ సిండికేట్ మ‌ధ్య వార్ జ‌రుగుతోంది. అప్ప‌టినుంచి ఈ ప్రాంతంలో 3,40,000కు పైగా హ‌త్య‌లు జ‌ర‌గ్గా వీటిలో నేర‌స్తుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల‌తోనే అత్య‌ధిక హ‌త్య‌లు వెలుగుచూశాయ‌ని చెబుతారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/