మెదక్ లో వీధికుక్కలు దాడిలో ఏడేళ్ల చిన్నారికి గాయాలు

వీధికుక్కలు దాడులు రోజు రోజుకు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం వీధి కుక్కల కట్టడికి కసరత్తులు చేస్తున్నట్లు చెపుతున్నప్పటికీ..రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం వీధికుక్కల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ లో వీధికుక్కలు దాడిలో ఏడేళ్ల చిన్నారికి గాయాలయ్యాయి. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటి పరిధిలో ఆలీ సాజ్ తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. ఆలీ సాజ్ ఏడేళ్ల కూతురు ఇంటి నుంచి షాపు కి నడుచుకుంటూ వెళ్తుంది.

అంతలోనే రెండు కుక్కలు వచ్చి బాలికపై దాడి చేసి కరిచాయి. బాలిక కేకలు వేయడంతో తండ్రి వచ్చాడు.. దీంతో అక్కడ నుంచి కుక్కలు వెళ్లిపోయాయి. కుక్కల దాడిలో బాలిక తలకు, చేతికి తీవ్ర గాయం అయ్యింది. దీంతో తల్లిదండ్రులు నర్సాపూర్ లో ప్రథమ చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.