వికాస్‌దూబే అనుచరుడి ఎన్‌కౌంటర్‌

మోస్ట్ వాంటెడ్ జాబితాలో అమర్ దూబేదే తొలి పేరు

close-aide-of-vikas-dubey-killed-in-encounter-in-hamirpur

లాఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ కాన్పూర్‌లో 8 మంది పోలీసుల్ని చంపిన వికాస్‌ దూబే ప్రధాన అనుచరుడు అమర్‌ దూబే పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు. దూబే కోసం 40 ప్రత్యేక పోలీసు బృందాలు 100 ప్రాంతాల్లో గాలిస్తున్నాయి. కాగా, హమీర్‌పూర్ జిల్లాలోని మౌదాహాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అమర్ దూబేను పోలీసులు కాల్చి చంపారు. అమర్ దూబే కూడా హిస్టరీ షీటరేనని, వాంటెడ్ క్రిమినల్ అని పోలీసులు తెలిపారు. ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్) పోలీసులు అతడిని మట్టుబెట్టినట్టు అధికారులు తెలిపారు. కాన్పూరులో జరిగిన 8 మంది పోలీసుల ఎన్‌కౌంటర్ కేసులో అమర్ దూబే కూడా నిందితుడని పోలీసులు పేర్కొన్నారు. కాన్పూరు కేసులో పోలీసులు రూపొందించిన మోస్ట్ వాంటెడ్ జాబితాలో అమర్ దూబే పేరు తొలి స్థానంలో ఉంది. అతడి తలపై రూ. 25 వేల నగదు రివార్డు కూడా ఉన్నట్టు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఐజీ అమితాబ్ యశ్ తెలిపారు.

గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబే పోలీసుల చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు. హర్యానాలోని ఫరీదాబాద్‌లో గల ఓ హోటల్‌లో అతడు ఉన్నాడని మంగళవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే వారు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న వికాస్‌ దూబే సదరు హోటల్‌ నుంచి పరారయ్యాడు. ఈ క్రమంలో హోటల్‌ నుంచి సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం చేసుకున్న పోలీసులు అక్కడ పనిచేస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతడి కోసం మళ్లీ గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని ఫరీదాబాద్‌, గురుగ్రాం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని పోలీసులు, ప్రజలను అప్రమత్తం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/