ఎంపీ కవితకు విజయశాంతి సానుభూతి..

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. నేడు శుక్రవారం (సెప్టెంబర్ 15,2023)న విచారణకు రావాలని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో దూకుడు పెంచిన ఈడీ కవితను ఇప్పటికే మూడు సార్లు కవితను ఈడీ విచారించింది. ఈక్రమంలో మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈ విచారణకు తాను వెళ్లడం లేదని , తన తరుపు లాయర్లు వెళ్తున్నారని స్పష్టం చేసింది. సుప్రీం కోర్ట్ లో ఈ కేసు ఫై తీర్పు వచ్చేవరకు ఈడీ ఆఫీస్ కు వెళ్ళేది లేదని పేర్కొంది.

ఇదిలా ఉంటె కవిత ఈడీ కేసుల ఫై బీజేపీ నేత మాజీ ఎంపీ విజయశాంతి సానూభూతి వ్యక్తి చేశారు. ఒక ఆడబిడ్డకు ఇలాంటి కష్టం రాకూడదని వ్యాఖ్యానించారు. అయితే, ఈ నోటీసులు కక్ష్య సాధింపు చర్యలో భాగమని కవిత పేర్కొనడాన్ని మాత్రం తప్పుబట్టారు. ఈ పరిణామంపై తన అభిప్రాయాలను సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

‘‘ఎమ్మెల్సీ కవిత గారు అరెస్ట్ కావాలని కోరుకోవడం రాజకీయంగా బీజేపీకి అవసరం కాదు. ఆ ఆవశ్యకత కూడా లేదు. దేశంలోని అనేక రాష్ట్రాలలోని ఆయా సమస్యలపై నిర్దేశించబడ్డ ప్రభుత్వ సంస్థలైన ఈడీ, సీబీఐలు తమ నిర్వహణ చేస్తాయి. ఎంఐఎం ప్రేరేపిత ధోరణి కలిగిన కొందరు కవిత గారు అరెస్ట్ కానట్లయితే… బీజేపీ, బీఆరెస్ ఒక్కటే అన్న భావంతో బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఓటు చెయ్యవచ్చన్న భయం బీఆరెస్‌కు ఉందేమో గానీ జాతీయవాద బీజేపీకి ఆ ఆలోచనా ధోరణి ఉండదు. గతంలో ఒకసారి అప్రూవర్‌గా ఉండి.. మళ్లీ కిలాఫ్‌గా మారి.. తిరిగి ఈ రోజు అప్రూవర్‌గా మారుతున్నోళ్లు బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే ఇయ్యన్నీ చేస్తున్నారనే అభిప్రాయం వినవస్తున్నది. ఇక, ఒక ఆడబిడ్డకు కష్టం రావద్దు… ఆరోపణలున్న ఏ ఆడబిడ్డ అయినా నిర్దోషులుగానే ఎప్పుడూ నిలవాలని మాత్రం వ్యక్తిగతంగా రాములమ్మ ఎన్నటికీ కోరుకుంటాది’’ అంటూ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.