తారకరత్న ఆరోగ్యంపై చంద్రబాబు ఆరా

గుండె పోటుకు గురైన తారకరత్న..స్టంట్ వేసిన డాక్టర్లు

chandrababu

కుప్పంః సినీ నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ పాదయాత్రలో నడుస్తూ ఉండగా… ఆయన గుండెపోటుకు గురై కుప్పకూలిపోయారు. ఆయనకు వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. ప్రస్తుతం ఆయన డాక్టర్ల అబ్జర్వేషన్ లో ఉన్నారు. మరోవైపు తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆయన మామ, టిడిపి అధినేత చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. ఎప్పటికప్పుడు బాలకృష్ణతో పాటు డాక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆసుపత్రిలో బాలకృష్ణతో పాటు టిడిపి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు.

కాగా, నందమూరి హీరో తారకరత్న ఈరోజు యువగళం పాదయాత్ర ప్రారంభం సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురికావడం తెలిసిందే. సొమ్మసిల్లి పడిపోయిన ఆయనను హుటాహుటీన కుప్పంలోని కేసీ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఆయనకు యాంజియోగ్రామ్ నిర్వహించి, స్టెంట్ వేసినట్టు తెలుస్తోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు స్పందించారు. ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికి తారకరత్న పల్స్ పూర్తిగా పడిపోయిందని తెలిపారు. శరీరం రంగు కూడా నీలంగా మారిపోయిందని పేర్కొన్నారు. వెంటనే చికిత్స ప్రారంభించడంతో, 45 నిమిషాల తర్వాత పల్స్ అందిందని వెల్లడించారు. తారకరత్న కోలుకుంటారని భావిస్తున్నట్టు వారు తెలిపారు. తారకరత్నను మరింత మెరుగైన వైద్యం కోసం బెంగళూరు తరలించనున్నట్టు తెలుస్తోంది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/