పార్టీ అనుబంధ సంఘాలతో విజయసాయిరెడ్డి భేటీ

అనుబంధసంఘాల నేతలతో అనుబంధ సంఘాల ఇంచార్జ్ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వారిపై కాస్త అసహనం వ్యక్తం చేసారు. అధికారంలో ఉన్నామన్న కారణంగా అనుబంధసంఘాల నేతలందరూ రిలాక్స్ అయ్యారని..ఇకపై ఆలా రిలాక్స్ అయితే బాగోదని హెచ్చరించారు. సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం చూపించారని ఆయన అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని, అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జులు, జిల్లా అధ్యక్షులకు విజయ సాయి స్పష్టం చేశారు. పార్టీ అనుబంధ విభాగాలైన మహిళ,యువజన, విద్యార్థి విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్చార్జిలు, జిల్లా అధ్యక్షులతో విడివిడిగా విజయసాయిరెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించి జోనల్ స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా వైస్సార్సీపీ జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలను పూర్తి చేయాలని వారికి స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు. ఇందులో భాగంగా జిల్లా, మండల, రాష్ట్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసి ఆయా కమిటీల్లో సభ్యులను భర్తీ చేయాలని తెలిపారు. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ, జనరల్ సెక్రెటరీ పదవులను పూర్తి చేయాలన్నారు.