చేప ప్రసాదం సందర్బంగా నాంపల్లి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

మృగశిర కార్తె సందర్భంగా అస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు 9వ తేదీన చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది. జూన్‌ 9వ తేదీ ఉదయం 7 గంటలకు చేప ప్రసాదం పంపిణీని ప్రారంభిస్తారు. ఈ క్రమంలో చేప ప్రసాదం కోసం భారీ సంఖ్యలో జనం రానున్న వేళ ఆ పరిసరాల్లో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు ఈరోజు(గురువారం) సాయంత్రం 6 గంటల నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ డైవర్షన్స్‌ శుక్రవారం అర్థరాత్రి 12 గంటల వరకు అమల్లో ఉంటాయి. పరిస్థితి బట్టి మార్పులు చేర్పులు చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు.

ఎంజే మార్కెట్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వైపు వెళ్లే వెహికల్స్​ను అబిడ్స్ జీపీవో, నాంపల్లి స్టేషన్​ మీదుగా పోనిస్తారు. బేగంబజార్‌ ఛత్రి‌, ఎంజే బ్రిడ్జి నుంచి నాంపల్లి వైపు వచ్చే వెహికల్స్​ను దారుసలాం, ఏక్ మినార్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. అసెంబ్లీ జంక్షన్‌ నుంచి నాంపల్లి స్టేషన్‌, అఫ్జల్‌గంజ్ వైపు వచ్చే వెహికల్స్ ను బషీర్​బాగ్ ​ఏఆర్ పెట్రోల్ ​పంప్, బీజేఆర్ విగ్రహం మీదుగా డైవర్ట్ చేస్తున్నారు.

చేప ప్రసాదం తీసుకునేందుకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా పార్కింగ్ సౌకర్యం కల్పించారు పోలీసులు. నాంపల్లిలోని గృహకల్ప, గగన్ విహార్, చంద్రవిహార్, ఎంఏఎం గర్ల్స్‌ జూనియర్ కాలేజీ, ఇంటర్ బోర్డు వద్ద వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. భారీ వాహనాలను మాత్రం గోషామహాల్ పోలీస్ స్టేడియంలో పార్క్ చేయాలి. బైక్​లను భీమ్ నగర్, గృహకల్ప, బీజేపీ ఆఫీస్‌ వద్ద మాత్రమే పార్క్ చేయాలి. పాస్‌లు ఉన్న వీఐపీలు తమ వాహనాలను సీడబ్ల్యూసీ గోడౌన్స్ పార్కింగ్‌ ఏరియాలో ఉంచాలి.

అలాగే చేప ప్రసాదం పంపిణీకి ఆర్‌ అండ్‌ బీ అధికారులు షెడ్స్‌, ఫ్లడ్‌ లైట్లు, భారీకేడ్లు ఏర్పాటు చేయగా.. ఆర్టీసీ అధికారులు ప్రత్యేకంగా బస్సులను నడపడం, జీహెచ్‌ఎంసీ అధికారులు శానిటేషన్‌, మరుగుదొడ్లను ఏర్పాటు చేయడం, జలమండలి అధికారులు మంచినీటిని అందుబాటులో ఉంచడం, సమాచార శాఖతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం పంపిణీని విజయవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.