‘కెనడాలో ఇందిర హత్య సెలబ్రేషన్స్..స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్

భారత్ తో మంచి సంబంధాలు కోరుకునే కెనడాకు ఇది సరికాదు..జైశంకర్

Canada’s event celebrating Indira Gandhi’s assassination: S Jaishankar Responds

న్యూఢిల్లీః మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ హత్యను కెనడాలో ఖలిస్థాన్ మద్దతుదారులు సెలబ్రేట్ చేసుకున్నారనే వార్తలపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ తో మంచి సంబంధాలు కోరుకునే కెనడాకు ఇది సరికాదని స్పష్టం చేశారు. కెనడాలో వేర్పాటువాదులు, తీవ్రవాదులు, హింసను సమర్థించే వ్యక్తులకు అవకాశం ఇవ్వడం సరికాదని, ఇది భారత్‌తోను సత్సంబంధాలకు మంచిది కాదన్నారు. ఇందిర హత్యను కెనడాలో సెలబ్రేట్ చేసుకునే వారిపై స్పందిస్తూ… ఇందులో పెద్ద సమస్య ఉందని తాను భావిస్తున్నానని, ఓటు బ్యాంకు రాజకీయాల అవసరాలు కాకుండా ఎవరైనా ఇలా ఎందుకు చేస్తారో మనం అర్థం చేసుకోలేకపోతున్నామన్నారు.

వేర్పాటువాదులకు, తీవ్రవాదులకు, హింసను సమర్థించే వ్యక్తులకు చోటు కల్పించడం సమంజసం కాదని, ఇది కెనడాకు కూడా మంచిది కాదన్నారు. కెనడాలోని బ్రాంప్టన్ నగరంలో ఇందిరా గాంధీ హత్యను సెలబ్రేట్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ స్పందించింది. ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించి కెనడాతో మాట్లాడాలని కేంద్రాన్ని కోరింది. బ్రాంప్టన్ నగరంలో ఇందిర హత్యను సెలబ్రేట్ చేసిన వీడియోను కాంగ్రెస్ నేత మిలింద్ దియోరా షేర్ చేశారు.