ఒక్కసారి గతం గుర్తు చేసుకోవాలి..విజ‌య‌శాంతి

కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో గుర్తు చేసుకుంటే మంచిది

హైదరాబాద్: బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మంత్రి కేటీఆర్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తోన్న వారికి కేటీఆర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన విష‌యంపై ఆమె స్పందిస్తూ… ‘అమ్మకు అన్నం పెట్టనోడు… పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడని… తెలంగాణలో తరచుగా వినిపించే సామెత. సరిగ్గా టీఆర్ఎస్ నేతలు కూడా అదే బాటలో పయనిస్తున్నారని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చూస్తే అర్థమవుతోంది’ అని విజ‌య‌శాంతి మండిప‌డ్డారు.

‘విశాఖపట్టణంలో ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీక‌ర‌ణ‌ అంశంపై కేటీఆర్ స్పందిస్తూ అవసరమైతే అక్కడికెళ్లి నేరుగా ఉద్యమంలో పాల్గొంటామంటూ కేంద్రంపై చిర్రుబుర్రులాడారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ కుటుంబం ఎలాంటి హామీలిచ్చిందో గుర్తు చేసుకుంటే మంచిది’ అని విజ‌య‌శాంతి చెప్పారు. ‘ఉమ్మడి రాష్ట్ర పాలకుల హయాంలో మూతపడిన తెలంగాణలోని నిజాం షుగర్స్, ఆజంజాహి మిల్స్, ఆల్విన్ కంపెనీ, ప్రాగా టూల్స్ లాంటి పలు కంపెనీలను వంద రోజుల్లో తెరిపించి ఉద్యోగాలు కల్పిస్తామని హామీలిచ్చారు. ఇప్పుడు మాటమాత్రంగానైనా వాటి ప్రస్తావన లేదు’ అని చెప్పారు. ‘ఇంతకీ ఇదంతా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల కోసం మాటలే తప్ప, ఈ దొర కుటుంబపు అసలు ధోరణి ఆంధ్ర ప్రాంత ప్రజలపై ఎంత అసభ్యకరంగా… అవమానించే ధోరణిలో… బూతు మాటలతో కూడి ఉంటుందో…’ అని విమ‌ర్శించారు. ‘ఒక్కసారి గతం గుర్తు చేసుకుంటే, వీరి ప్రస్తుత ప్రకటనలను సమర్థిస్తున్న ఆయా నేతలు కొందరికి సరిగ్గా అర్థం అవుతుంది’ అని విజ‌య‌శాంతి మండిప‌డ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/