ముఖ్య అనుచరులతో వంగవీటి రాధా భేటి.. భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేసే అవకాశం!

జనసేనలో చేరాలని రాధాకు సూచిస్తున్న కొందరు సన్నిహితులు

Vangaveeti Radha meeting with key followers

అమరావతిః ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వంగవీటి రాధా మళ్లీ పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ తరపున పోటీ చేయబోతున్నారే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో, ఆయన తన ముఖ్య అనుచరులతో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశం తర్వాత ఆయన ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సమావేశానంతరం ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తారని సమాచారం.

ప్రస్తుతం రాధా టిడిపిలో ఉన్నప్పటికీ యాక్టివ్ గా లేరు. విజయవాడ సెంట్రల్ సీటును రాధా అడిగినట్టు… అయితే ఆ స్థానంలో బొండా ఉమా ఉండటంతో రాధా వినతిని పార్టీ అగ్ర నాయకత్వం తిరస్కరించినట్టు తెలుస్తోంది. వేరే నియోజకవర్గం టికెట్ ను రాధాకు హైకమాండ్ సూచించినట్టు తెలుస్తోంది.

గతంలో వైఎస్‌ఆర్‌సిపిలో ఉన్నప్పుడు కూడా సెంట్రల్ టికెట్ ను రాధా కోరారు. ఆ స్థానం టికెట్ ను జగన్ ఇవ్వకపోవడంతో ఆయన వైఎస్‌ఆర్‌సిపి నుంచి బయటకు వచ్చారు. ఇంకోవైపు జనసేనలో చేరాలని రాధాకు సన్నిహితులు సూచిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇటీవల ఓ కార్యక్రమంలో కొడాలి నానిని రాధా కలిశారు. దీంతో, ఆయన మళ్లీ వైఎస్‌ఆర్‌సిపిలోకి వెళ్లవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ప్రచారాలన్నింటి నేపథ్యంలో, ఈనాటి సమావేశంలో రాధా కీలక నిర్ణయం తసుకునే అవకాశం ఉందని చెపుతున్నారు. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.