హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ పై మంత్రి కెటిఆర్ సమీక్ష

minister-ktr

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్‌పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని హైదరబాద్‌ రైల్‌ భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌, జీహెచ్‌సీఎం పరిధిలోని జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెట్రో విస్తరణపై అధికారులతో చర్చించారు.

కాగా, నగరం నలువైపులా రూ.60 వేల కోట్లతో మెట్రోను విస్తరించాలని మంత్రి మండలి నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు 31 కిలోమీటర్ల మేర విస్తరించనున్న మెట్రోకు సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. టెండర్‌ ప్రక్రియ కూడా తుదిదశకు చేరుకున్నది. దీనితోపాటు జూబ్లీ బస్టాండ్‌ నుంచి తూంకుంట వరకు డబుల్‌ డెక్కర్‌ మెట్రో (ఒక లెవల్‌లో వాహనాలు, మరో లెవల్‌లో మెట్రో) ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ప్యాట్నీ నుంచి కండ్లకోయ ఓఆర్‌ఆర్‌ వరకు మరో రూట్‌లో (ఆదిలాబాద్‌ -నాగపూర్‌ రూట్‌లో) డబుల్‌ డెక్కర్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించాలని నిర్ణయించింది. దీనికి సంబందించి రక్షణశాఖకు సంబంధించిన కంటోన్మెంట్‌ భూములు కొన్ని ఉన్నాయి. హైదరాబాద్‌లో అతిముఖ్యమైన మరో మార్గం ఇస్నాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు, మియాపూర్‌ నుంచి లక్డీకపూల్‌ వరకు, విజయవాడ దారిలో ఎల్బీనగర్‌ నుంచి పెద్దఅంబర్‌పేట వరకు, వరంగల్‌ రూట్‌లో ఉప్పల్‌ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ వరకు మెట్రోను విస్తరింపజేయనుంది.

మహబూబ్‌నగర్‌ రూట్‌లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌వైపు నిర్మిస్తున్న మెట్రోను భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్‌నగర్‌ వరకు, తార్నాక నుంచి ఈసీఐఎల్‌ క్రాస్‌రోడ్‌ వరకు విస్తరించనున్నారు. ఇక పాతబస్తీ మెట్రోను కూడా సమగ్రంగా విస్తరించనున్నారు. ఓఆర్‌ఆర్‌ ఉన్న 159 కిలోమీటర్లు చుట్టూ మెట్రోను విస్తరించబోతున్నారు. అదేవిధంగా ఎయిర్‌పోర్టు నుంచి ఫార్మాసిటీ అందుబాటులోకి రాబోతున్న కందుకూరు వరకు మెట్రోను నిర్మించనున్నారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని మెట్రోరైల్‌ అథారిటీ, మున్సిపల్‌ శాఖను సీఎం కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే.