జనసేనలోకి ఎంపీ బాలశౌరి,,ముహూర్తం ఫిక్స్

ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని పార్టీలలో వలసల పర్వం ఎక్కువైంది. ముఖ్యంగా ఈసారి టీడీపీ – జనసేన కూటమిలోకి పెద్ద ఎత్తున నేతలు చేరుతున్నారు. వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా బయటకు వచ్చి టీడీపీ లేదా జనసేన లో చేరుతున్నారు. ఇప్పటికే పలువురు చేరగా..తాజాగా
మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఫిబ్రవరి 4న జనసేనలో చేరుతున్నారు.

మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక ఆయన వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేసేది తెలియాల్సి ఉంది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేదంటే ఎంపీగానే బరిలోకి దిగుతారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. కాగా బాలశౌరి ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

బాలశౌరి.. సీఎం వైఎస్ జగన్ రెడ్డికి ఈయన అత్యంత ఆప్తుడు అనే విషయం తెలిసిందే. మచిలీపట్నం నుంచి ఎంపీగా ఓ మాజీ మంత్రిని బరిలోకి దింపడానికి హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు ముందుగానే తెలుసుకున్న బాలశౌరి.. వైసీపీకి రాజీనామా చేసేశారు. మరోవైపు.. బాలశౌరి ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావిస్తున్నారని అందుకే రాజీనామా చేశారని కూడా ప్రచారం జరిగింది.