రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..తగ్గిన వందేభారత్ టికెట్ ధరలు

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్..వందేభారత్ టికెట్ ధరలు తగ్గాయి. కేంద్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వందేభారత్ ట్రైన్స్ ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటీకే దేశ వ్యాప్తంగా ఈ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. అయితే సామాన్య ప్రజలు మాత్రం వీటిల్లో ప్రయాణించడానికి కాస్త వెనుకడుగు వేస్తున్నారు. దీనికి కారణం టికెట్ ధరలే. సాధారణ ట్రైన్ టికెట్ ధర కన్నా ఈ వందేభారత్ ట్రైన్ టికెట్ ధరలు ఎక్కువగా ఉండడం తో చాలామంది కాస్త ఆలస్యమైనా సాధారణ ట్రైన్స్ లలో ప్రయాణించడానికే మొగ్గు చూపిస్తున్నారు.

దీనిని గమనించిన రైల్వే వందేభారత్ టికెట్ ధరలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. వందేభారత్‌తో పాటు అన్ని AC చైర్‌ కార్‌, ఎగ్జిక్యూటివ్ క్లాస్‌ రైళ్ల టికెట్ ధరల్ని తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 25% మేర తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. గత నెల రోజులుగా ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ 50% కన్నా తక్కువకు పడిపోయింది. అందుకే…ఈ నిర్ణయం తీసుకున్నట్టు రైల్వే బోర్డ్ తెలిపింది. ఈ రైళ్ల వినియోగం మరింత పెంచేందుకు టికెట్ ధరల్ని తగ్గించినట్టు వివరించింది. ఈ ధరలు తగ్గించే అధికారం జోనల్ రైల్వేస్‌కే అప్పగించింది రైల్వే శాఖ. అయితే..బేసిక్ ఫేర్‌పైనే ఈ 25% తగ్గింపు ఉంటుంది. మిగతా ఛార్జీలు..అంటే రిజర్వేషన్ ఛార్జ్‌లు, సూపర్ ఫాస్ట్ సర్‌ఛార్జ్‌, GST ఛార్జీల్లో మాత్రం ఎలాంటి మార్పులేదు. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని రైల్వే ప్రకటించింది.