ఉత్తరకాశీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్‌ సక్సెస్‌..

ఉత్తరకాశీ టన్నెల్‌లో చిక్కుకున్న 41 మంది కార్మికులు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి క్షేమంగా బయటకు వచ్చారు. ‘ర్యాట్‌-హోల్‌ మైనింగ్‌’ నిపుణులు అద్భుతం సృష్టించారు. గతంలో నిషేధించిన ఓ పద్ధతే చివరకు దిక్కయ్యింది. అదే ‘ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌’ (Rat Hole mining). ఆరు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఆపరేషన్‌ చేపట్టినప్పటికీ.. అత్యంత ప్రమాదకరమైన ఈ విధానంలోనే సొరంగంలో చిక్కుకున్న కూలీలను రెస్క్యూ బృందాలు (Tunnel Operation) చేరుకోగలిగాయి. ఇలా 41 మంది ప్రాణాలను కాపాడారు. కూలిన సొరంగంలో మాన్యువల్‌గా తవ్వకాన్ని చేపట్టి 24 గంటల్లో 10 మీటర్ల లక్ష్యాన్ని పూర్తిచేశారు. ప్రాణాలతో బయటకు వచ్చిన తమ వాళ్లను చూశాక.. కార్మిక కుటుంబాల సభ్యులు కన్నీంటి పర్యంతమయ్యారు. ఆనందంతో అక్కడున్నవారితో స్వీట్స్‌ పంచుకున్నారు. సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులను చిన్యాలిసౌర్‌ హాస్పటల్ కు తరలించారు.

రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడంపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆపరేషన్‌లో పాలుపంచుకున్న ప్రతిఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఇది కృతజ్ఞత తెలపాల్సిన సమయం. టన్నెల్‌లో చిక్కుకుపోయిన 41 మందిని కాపాడేందుకు 17 రోజుల పాటు నిర్విరామంగా పనిచేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడా విజయం ఇవ్వలేని ఆనందాన్ని మీరు దేశప్రజలకు అందించారు. ఆశలు సాకారం చేశారు. అందరం కలిసికట్టుగా శ్రమిస్తే సాధ్యం కానిది ఏదీ లేదని, బయటపడలేనంత లోతైన సొరంగం ఏదీ ఉండదని మీరు నిరూపించారు’’ అని ట్వీట్ చేశారు.