ఘోర ప్రమాదం.. నదిలోపడిన ట్రాక్టర్‌.. 15 మంది మృతి

Uttar Pradesh Accident: 15 Killed as Speeding Tractor Falls into Pond in Kasganj

లక్నోః ఉత్తరప్రదేశ్‌లో తీరని విషాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న వాహనం చెరువులోకి దూసుకెళ్లిన ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు హరిద్వార్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌‌గంజ్‌‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో 8 మంది చిన్నారులున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు.

మాఘ పూర్ణిమను పురస్కరించుకొని గంగానదిలో స్నానమాచరించేందుకు వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.